నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

ISRO - పేద ప్రజల ఉసురు

చరిత్ర మర్చిపోయిన కొన్ని త్యాగాలకోసం చదవండి !
చాల పెద్ద మ్యాటర్, నిజాలకోసం చదవండి!
సుమారు 1968 వ సంవత్సర చివరలో ఒక 30 గ్రామాలని కాళీచేయించి దాదాపు 92800 ఎకరాల భూమిని ప్రభుత్వం తన అవసరాలకోసం తీసుకోవాలని చూసింది. కానీ అక్కడి ప్రజలు ఒప్పుకోలేదు. ప్రతి కుటుంబానికి కొంత భూమి ఉండేది. ఆ ముప్పై గ్రామ్మాల్లోనే దాదాపు 10 వేల పశువులున్నాయి. జనాభా దాదాపు 20 వేలు. ఇంత చక్కని ప్రదేశాన్ని, సంపదని, తర తరాల జ్ఞాపకాలని వదులుకోడానికి ఎవరికి మాత్రం మనసొప్పుతుంది. తిరగబడ్డారు.
ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు కాలిచేయం అన్నారు. స్థానిక నాయకులు ప్రజల్ని ఒప్పించే పని చేసినా ఒప్పుకోలేదు. చివరికి సైన్యాన్ని దించి అరాచకంగా కాళీచేయించారు. అయినా కొంతమంది అక్కడే ఉండడంతో, ఆ అర్ధరాత్రి గ్రామాలమీద బాంబులు వేస్తారు అని ప్రచారం చేయించి, భయపెట్టి ఒక్కరు కూడా లేకుండా ఆభూమిని సొంతం చేసుకున్నారు.
కొంత పోరాట ఫలితంగా ప్రభుత్వం వీళ్ళందరికీ కొంత భూమి ఇవ్వడానికి ఒప్పుకుని పట్టాలు (బి ఫారాలు) ఇచ్చి తరలించింది. (కానీ వీళ్ళు వదులుకున్నవి పట్టా భూములు)
రోజులు గడుస్తున్నాయి, బ్రతికున్న శవాలలా జీవిస్తున్నారు. వ్యవసాయం లేదు. పశువులన్నిటిని వదిలేసి వచ్చేసారు. దిక్కుతోచని స్థితిలో వలసబాట పట్టారు. ఆ స్థలాలని అలానే వదిలేసి సగం మంది పట్టణ ప్రాంతాలకి వలసి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న వాళ్ళు ప్రతిరోజూ 30 కిలోమీటర్ల దూరం వెళ్లి కూలి పని చేసుకొంటూ జీవిస్తున్నారు. వీళ్ళమీద ఈ సారి ప్రకృతికి కోపం వచ్చింది. 1984 లో అనుకుంటా పెద్ద తుఫాను వచ్చి ఉన్న గుడిసెలు, చెంబు, తపాలాలతో సహా కొట్టుకుపోయాయాయి. ప్రాణాలతో, కట్టుబట్టలతో ఏం చేయాలో తెలియని స్థితిలో మల్లి తమ పూర్వ గ్రామాలదగ్గరికె పయనం అయ్యారు.
చివరికి వారు ప్రభుత్వం వాల్లభూములు లాక్కొని ఏర్పాటు చేసిన సంస్థలో కూలీపనివారుగా మిగిలిపోయి ఈ నాటికీ తరాలు మారుతున్నా లేబర్ కాలనీ వాసులుగా పిలిపించుకుంటూ అక్కడే జీవిస్తున్నారు. ఏ కొద్దిమందో 10 వరకు చదివిన వాళ్ళు పేర్మినెంట్ ఉద్యోగాలు పొందారు. ఇప్పుడు లెక్కేస్తే ఆ సంస్థలో 1400 మంది ఉద్యోగుల్లో కేవలం 10 మందికూడా అప్పటి నిర్వాసితులు లేరు.
ఇంతకీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ సంస్థ పేరు చెప్పలేదు కదా "ఇస్రో". అవును! ఇస్రో నే.
నిన్న 104 ఉపగ్రహాలని పంపి మన దేశానికి వన్నె తెచ్చిన, మనందరికీ గర్వకారణం అయినా అదే ఇస్రో సంస్థని నెలకొల్పడానికి అప్పటి ఇందిరా గాంధీ అరాచకంగా చేసిన నిర్వాకం ఇది. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా 20 వేలమంది ప్రజల జీవితాలని లేబర్ కాలనీకి చేర్చిన చరిత్ర ఇది.
నిన్న ఇస్రో ప్రయోగాన్ని చూడ్డానికి శ్రీహరికోటకు వెళ్లిన నాకు ఎదురైనా సందేహాల నివృత్తిలో భాగంగా బయటపడిన నిజాలు. ఇస్రో సంస్థని ఇంతమంది జీవితాల సమాధుల మీద కట్టారా అని తలుచుకున్నప్పుడు నా మనసు ఉద్వేగంతో నిండిపోయింది.
ఏం చేయగలం ! దేశం గర్వించే సంస్థని ఏర్పాటు చేసి మనందరికీ గర్వ కారణం అయినందుకు ఆనందపడాలో, ఇంతమంది జీవితాలని గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని అసహ్యించుకోవాలో అర్ధం కాలేదు. ఏమీ తెలియని అమాయకత్వం వాళ్ళది. ఎన్నో నమ్మక ద్రోహాలని చూసిన జీవితాలు వాళ్ళవి. నులక మంచం మీద చుట్ట తాగుతూ లేబర్ కాలనీ వాసులు దేశ భక్తి మాటున చెప్పుకోలేని నిజాలని చెప్పడానికి యెంత ఇబ్బంది పడ్డారో కళ్లారా చూసాను.
సూలదరువు, మాదలం, దేవలం, పెనుబాకు, చెంగలపాలెం, కొత్తచెను, కలంవాగు, ఏరెందొడ్డి (ఇప్పుడు 2nd లాంచ్ పాడ్ వుండే ఏరియా), పిచ్చెరుగుంట, కొత్తచెన్నం, బేరిపెట్టు, జానీ పాలెం, పెదరెట్టమాల, చినరెట్టమాల, పల్లెవీడు, చెన్నుగారిపాలెం, పల్లెకుప్పం, తెట్టెపెట్ట, కుప్పం లాంటి దాదాపు 30 గ్రామాల ప్రజల భావోద్వేగాలకు ప్రతిరూపంగా కనిపించిన పెంచలరెడ్డి (పేరు మార్చాను) పంచుకున్న విషాద సంఘటనలు.
ఈ దేశం గర్విస్తున్న ఈ సంస్థని చూసి వీళ్ళు కూడా గర్విస్తున్నారు అని చెప్పడానికి నేను సందేహిస్తున్నాను.
మనకి అవసరంలేని రెండు గజాల స్థలాన్ని సైతం పక్కింటివాడికి ఇవ్వని మనం, వీళ్ళ మూడో తరం జీవితాలని కూడా చిదిమేస్తూంటే వాళ్లకి ఈ సంస్థ పట్ల అభిమానం వుండాలని, ఉంటుందని అనుకోను. ఇంత పెద్ద సంస్థగా ఎదిగాక కూడా వీళ్ళకి కనీస మర్యాదగా ప్రశంసిస్తూ ఏనాడు ఒక్క కాగితం ముక్క కూడా ఇవ్వని సంస్థని చూసి, 104 ఉపగ్రహాలని పంపించింది అన్న ఆనందం నాకు ఏ మాత్రం కలగలేదు. ఇక వాళ్లకి ఎలావుంటుంది.
కొసమెరుపేంటంటే శ్రీహరికోట నుండి కాళీచేయించి వీళ్ళకి నెల్లూరు దగ్గరలో సుమారు 150 ఎకరాలు భూములు ఇచ్చారు. (ఈ గ్రామాల మొత్తం 92800 ఎకరాలు). 1984 లో తుఫాను తర్వాత వీళ్ళలో ఏఒక్కరి దగ్గరా ప్రభుత్వం ఇచ్చిన బి ఫారం పట్టా లేదు. అన్ని తుఫానులో కొట్టుకు పోయాయి. ఆ తర్వాత వీళ్ళు అక్కడినుండి తరలి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ భూమిని ఎవరో కంపెనీ వాళ్ళు ఆక్రమించుకొని, కాగితాలు సృష్టించుకొని ఈ మద్యే ఎకరం 4 కోట్లకి అమ్ముకున్నారట.
అన్ని విధాలా ఛిద్రం అయిపోయిన వీల్లజీవితాలని ఆదుకొనేదెవరు. ఇస్రోకి లేబర్ అవసరం కాబట్టి వీళ్ళ జీవితాలు ఇలాగే ఉంటే బెటర్ అని అనుకుంటుందేమో. ఎంతైనా ఈ మధ్య వ్యాపారం బాగానే చేస్తుంది కదా.
అసలు అభివృద్ధి దేనికి,
మనుషులు ఉన్నతంగా బతకడానికి కదా !
మరి సాటి మనిషి జీవితాన్ని ఛిద్రం చేసి వాళ్ళ కన్నీళ్ళ లోనుండి అభివృద్ధి వస్తుంది అనుకుంటే,
పైగా వాళ్ళ కన్నీటిని తుడవలేని ఆ అభివృద్ధిని వద్దంటాను నేను...