నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

సశేషం

చీకటిని వెలుగుతో తరిమేసే ఉదయాలన్నీ, షరా మామూలే
రాత్రి పగిలిన మనసుల్ని పెద్దరికంతో అతికించుకుని
గుండెతడిని బతికించుకోవడం కోసం
ఉక్కిరిబిక్కిరి పనిలో ఊపిరాడకపోవడం ఎంత సుఖం!!

దూరమైన అనుబంధంలో అపార్థంగా గుచ్చుకుని
అక్కడే మరణించిన రహస్యాన్నీ,
అర్థాంతరంగా ముగిసిపోయిన సశేషాన్నీ,
కొన్ని మాయదారి సాయంకాలాలు మోసుకొస్తుంటాయి
బండరాతిమీద గుండె పగిలిన వర్షపు చినుకులై
కళ్ళు రెండూ చెమ్మగిల్లుతాయి

జీవితం నాకు నవ్వులిచ్చింది, కన్నీళ్లనిచ్చింది, 
వాటి వల్లనే నాకు
హృదయం ఉప్పొంగడానికీ, బద్దలవడానికీ మధ్య తేడా తెలుస్తోంది
జీవన్మరణాలు చెరిసగాలైన ఒకానొక లిప్తలో
నిద్రకు అలసటనీ, నిజాలకు ఆశల్నీ ధారపోసి
ఒంటరిగా, గాజుపూల పగుళ్లని గుండెలోపలికి అదుముకుంటూ…
ఎటు కదిలితే నీడకు ఏ బాణం గుచ్చుకుంటుందో
తెలీని అభద్ర జీవన బీభత్స సౌందర్యం...