నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

తెలుగు వెలుగు

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా Veera Narasimha Raju గారు రాసిన వ్యాసం ఆకట్టుకొంది.

దేశ భాషలందు తెలుగు లెస్స అంటే లెస్ అని అనుకుంటున్నారు మన జనాలు. ప్రభుత్వ పాలకులదీ అదే తీరు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిర్బంధ తెలుగు ప్రవేశ పెట్టడములో ప్రభుత్వాలు అలసత వహిస్తున్నాయి. ప్రజలూ ఆలాగే ఉన్నారు. ఎవరికైనా వారి వారి మాతృభాష అంటే అంత ప్రేమ ఉంటుంది.. 
మన తెలుగు వారికన్నా మిగతా భాషీయులకు వారి మాతృభాష అంటే ఇంకాస్త ప్రేమ ఎక్కువ. మనం మన తోటి తెలుగు వారితో ఆంగ్ల సంభాషణ చేయడం గొప్ప అనుకుంటాము.. అదే ఏ మలయాళీ నో , కన్నడిగనో , అమితంగా తమిళీయులనో చూడండి. వారు తమిళ వారిని చూస్తే టక్కున వారి భాషలో సంభాషించడం మొదలు పెడతారు. మరి మనవారో, మన పక్కింటి వారిని చాలాకాలం తరువాత కలిస్తే కూడా మనం మాటాడేది.. ఆంగ్లములో పలకరింపే. 
ఈ జాడ్యం 1990 ల తరువాత మరీ మితిమీరిపోయింది. ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మాటాడితే శిక్షించే ప్రబుద్ధులు అధ్యాపకులు అయ్యారు. ఆంగ్లములో మాటాడితే నాగరీకమా? మరి మన మాతృభాషలో సంభాషిస్తే అది అనాగరీకమా? వేమన , సుమతి పద్యాలు నేర్చుకోవడం పాత పద్దతులు అయ్యాయి.
తెలుగు భాష శబ్ద సంపదలో, శబ్ద సౌష్టవంలో, భావ వ్యక్తీకరణలో, శ్రావ్యతలో తెలుగుతో మిగతా దేశ భాషలు సాటి రావు. వీనుల విందుగా ఉన్న మన ఆనాటి తెలుగు గీతాలు , మన పూర్వీకులు రచించిన పదాలు , కీర్తనలు వినండి . తెలుగు భాషలోని మాధుర్యం ఏమిటో తెలుస్తుంది. 
జన్మతః తమిళుడైన మహాకవి సుబ్రహ్మణ్య భారతి ఏమన్నారో తెలుసా? సుందరమైన తెలుగు పాట పాడుతూ సింధూ నదిలో పడవ నడుపుదాం అంటూ.. అద్భుత గీతాన్ని వ్రాస్తూ సుందర తెనుంగు అని మెచ్చుకున్నారు. 
మన విశ్వనాథులవారి మాటల్లో చెప్పాలి అంటే "ఒక్క సంగీతమేదో పాడునట్లు, మాట్లాడునప్పుడు విన్పించు భాష తెలుగు భాష. భాషలొక పది తెలిసిన ప్రభువు చేత, భాష అంటే ఇది అని అనిపించుకున్న భాష". 
కేరళ మహారాజు స్వాతి తిరునాళ్ తెలుగు భాషా సౌందర్యం తెలిసినవాడు కావున తనకు తెలుగు నేర్పించేందుకు ఆంద్ర దేశం నుండి ఏకంగా ఒక తెలుగు పండితున్నే తెప్పించుకుని ఈ భాషను నేర్చుకున్నారు. 
ఇంక ఏకంగా త్యాగరాజ ఆరాధనా ఉత్సవాలకు ఆద్యురాలు "విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ " గారు జన్మతః కన్నడ దేశము , పెరిగింది తమిళ దేశములో అయినా నాకు అత్యంత ప్రియమైనది తెలుగే అని గర్వంగా చెప్పుకున్నారు. 
ఎందరో మహా మహులు కీర్తించిన తెలుగు నేడు మన వారికే కాక పోతున్నది. తెలుగు పతాకం యెరుగని దేశమే లేదు, తెలుగు దివ్వె వెలుగునట్టి దిశయే లేదు అని తెలంగాణా దార్శనికుడు శ్రీ దాశరథి రంగాచార్య గారు వెలుగెత్తి చాటారు.. 
తెలుగు నేల మీద పుట్టి , తెలుగు నేల మీద పెరిగి తెలుగు మాటాడ్డం రాదని చెప్పుకునే కుసంస్కారులను మన కాళోజీ " తెలుగు బిడ్డవయుండి, తెలుగు రాదంచు, సిగ్గులేకా ఇంక చెప్పడమెందుకురా?, అన్య భాషలు నేర్చి, ఆంధ్రమ్ము రాదంచు, సకలించు ఆంధ్రుడా చావవెందుకురా అని తీవ్రంగా మందలించారు. అయినా తెలుగు భాష తీయదనాన్ని నేర్చుకుని ఆస్వాదించే ప్రజలు కరువైపోతున్నారు. 
సాక్షాత్తు జాతిపిత మహాత్మా గాంధి తెలుగు నేర్చుకోవాలని తెలుగు వారి గూర్చి ఏమన్నారో తెలుసా ? తెలుగు భాష మధురమైనది. ఆ భాష నేర్చుకోవాలని నేను చేసిన ప్రయత్నం అక్షరక్రమంతోనే ఆగిపోయింది. 
తెలుగువారు అమాయకులు, మధుర స్వభావులు, త్యాగనిరతులు. 
మనం మధుర స్వభావులమే పరభాషలను నెత్తిన పెట్టుకోవడములో, 
మనం త్యాగ నిరతులమే .. గర్వంగా నేను తెలుగు వాడిని , నాది తెలుగు భాష అని చెప్పుకోవడానికి వెనుకాడటములో.