నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

నేనెట్టా బతికేది?

మెతుకు మెతుకు కూడబెట్టి ముద్ద పోగేస్తే 
దొంగ కూడంటున్నారు నేనెట్టా బతికేది?
కన్నీటి బొట్టు బొట్టు దాపెట్టి ఏడుపు పోగేస్తే 
నా ఏడుపు చెల్లదంటున్నారు నేనెట్టా చచ్చేది?
నా చెమట చుక్క మారదా?
నే కరిగించిన నా కండని నే ఖర్చుపెట్టుకోకూడదా?
కష్టం రద్దు అయింది అంటే పోన్లే అనుకొందు గానీ
కష్టం విలువే రద్దు అయిందంటే కడుపులో దేవుతుంది 
అడిగితే రేపు బావుంటదంటున్నారు... అయితే 
ఆ బావుండే రేపట్లో నేనుండొద్దా?
అది ఏ మాత్రం బావుందో నేను చూడొద్దా?
రెక్కాడితే తప్ప డొక్కాడని బతుకులుకి రోజు గడవొద్దా?
సరే....! దేశంకోసమైతే ప్రాణాలిస్తా
రేపన్నది బావుండేందుకు నా చావు నేను చస్తా 
నేటి ఆశలు, ఆకలి చావులు పంచుకు పుట్టే రేపటి కోసం
నా ఈ కట్టెని మట్టిలో కలిపి ఎదిగే చెట్టుకి ఎరువు అవుతా.
పది శాతం పందికొక్కులు పట్టుబడతామని 
తొంభై శాతం బతుకులు గాలమవుతున్నాయి 
పట్టుబడలేదా ?
ఈ గాలాలే తిరగబడి అగ్నిగోళాలవుతాయి.
మాట మీద నిలబడితే నువ్వేగరేసే జాతీయ జెండాని 
మాట తప్పితే నిను గద్దె దించే విప్లవ దండోరాని....!

#burra_saimadhav