నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

మరో ఉదయం మహోదయంలా...

లోలోపలంతా శూన్యం 
ఒక్కో అణువును ఆక్రమించుకుంటూ 
ఖాళీలను పూరిస్తున్న శూన్యం 
కాలానికి గ్రహణం పట్టిందేమో 
ఆగిపోయింది...కదలక 
నింగికేం తెలుసు నేల అలజడి 
గాలికేం తెలుసు నిప్పులోని సెగ 
మానని గాయంలా మనసుని దహించే ఙ్ఞాపకం 

ఆశల సీతాకోకచిలుకలు ఎగిరేదెప్పుడు 
కొన్ని చూపుల బాణాలు ఎక్కడినుంచో 
వాటి రెక్కలు తెంపిపోతుంటే...
నిట్టూర్పు క్షణాల ఓదార్పుకేది విరామం ?
స్వప్నాలను శాసించే కొన్ని అడుగుల నీడ...
నిదుర లేచిన పక్షి రెక్కలు విప్పినట్టు 
కొంగ్రొత్త ఆలోచనల స్వతంత్రపు జాడ....
ఇక ఈ నిశ్శబ్దపు శూన్యాన్ని విడనాడాలి
మరో ఉదయం మహోదయంలా మారాలి...!!

Source: Dr.Yashoda