నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

Romance In Public (R I P)

ఓ సినిమా థియేటర్‌కి ఇద్దరు లవర్స్ వెళితే ఎక్కడెక్కడో చేతులు పెట్టుకుని.. ఒకరిని మరొకరు దగ్గరకు లాక్కుంటూ నడుస్తుంటే ఎవరైనా వారి వైపు ఇబ్బందికరంగా చూస్తే.. ఇంత వెనుకబడిన సొసైటీ ఏంటా అని, తమకు ప్రైవసీ మిస్ అవుతోందని, ఎవరి పని వాళ్లు చేసుకోవచ్చని కదా అని తెగ ఫీలైపోతారు.
నిజమే.. జనాలకు ప్రైవసీ కావాలి... ఎవరూ వాళ్ల జోలికి వెళ్లకూడదు.. అసలు వాళ్లేం చేసినా వాళ్ల వైపు చూడకూడదు.. ఎవరి పని వాళ్లు చేసుకెళ్లాలి.. వాళ్లెంత అసభ్యంగా ప్రవర్తించినా "ఇదంతా కామన్" అని చాలా మెచ్యూరిటీ తెచ్చుకుని పెద్ద మనస్సుతో చూసీ చూడనట్లు బిహేవ్ చెయ్యాలి. Yeah.. USలోనూ, ఇంకా చాలా విదేశాల్లోనూ ఎవరి పనులు వాళ్లు చేసుకుంటారు, ఎవర్నీ పట్టించుకోరు. అది ఇక్కడ కూడా ఉండాలని కోరుకుంటారు. గుడ్ పాయింట్. కానీ పబ్లిక్ ప్లేస్‌లో లిమిట్స్ క్రాస్ చేసి బిహేవ్ చేసి ప్రైవసీ కావాలని కోరుకోవడం ఏంటో కాస్త క్లారిటీ కావాలి.
ఎవరిళ్లల్లో వాళ్లు ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు, కానీ నలుగురు మధ్యకి వచ్చాక ఓ code of conduct ఉంటుంది. ఒక్కో దేశానికి ఒక్కో code of conduct మెచ్యూరిటీ లెవల్స్, ప్రైవసీ బోర్డర్స్ ఉంటాయి. సో వాటిని క్రాస్ చేసి.. మా మానానికి మమ్మల్ని వదిలేయండి అని కోరుకోవడం ఎంత వరకూ కరెక్ట్?
నలుగురు మధ్య ఒకరి మీద ఒకరు వాలిపోతే కొత్తగా ప్రేమ వచ్చి పడదు.. ఎక్కడెక్కడో చేతులు పెట్టుకుని బిహేవ్ చేస్తే అది ప్రేమ కాదు... అలాగే ఇంటిమసీ అనేది అందరి ముందూ ప్రదర్శించుకునేది కాదు. కొన్నిసార్లు అన్పిస్తుంది.. పబ్లిక్‌గా ఇలా ఉండే వాళ్లు ఇంటికెళ్తే అసలు ఇంత అన్యోన్యంగా ఉండగలుగుతున్నారా అని? అలా ఉండే వాళ్లే అయితే ఇన్ని డైవోర్స్ కేసులు ఎందుకు వస్తున్నాయా అని!
ఇది మోరల్ పోలీసింగ్ కాదు.. ఇలాగే ఉండమని ఎవరూ చెప్పట్లేదు. మీ ఇష్టమొచ్చినట్లు ఉండొచ్చు.. కానీ చూసే వాళ్లకి కాస్త ఎబ్బెట్టుగా లేకపోతే చాలు. లవర్ పట్లనో, పార్టనర్ పట్లనో విడిచి పెట్టి ఉండలేనంత ప్రేమ ఉండడం సూపర్! కానీ "అది ప్రేమ కాదేమో.. వీళ్లేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు" అని వేరే వాళ్లకి అన్పించేలా మన బిహేవియర్ ఉంటే వాళ్ల మధ్య ప్రేమ అనేది ఉందనే దానికన్నా వేరే ఫీలింగ్ చూసే జనాలకు వస్తుంది. అది చాలా అగౌరవం.
ఇవి పాతకాలం మాటలు కాదు... పబ్లిక్ ప్లేసెస్‌లో లిమిట్స్ క్రాస్ చేసి ఉండడం మోడ్రన్‌గా ఉండడం కాదు.. నేను చివరిగా చెప్పే ఒక్క మాట వింటే ఎవరూ ఇలాంటి పనులు చెయ్యడానికి సాహసించరు... అదేంటంటే..
"నువ్వు నీ పార్టనర్‌ని అందరి ముందూ చేసేది చూసే చాలామంది నీ పార్టనర్‌ పట్ల వేరే దృష్టితో చూస్తుంటారు. నీ లవర్ కావచ్చు, నీ జీవిత భాగస్వామిని కావచ్చు అంత చులకన చేస్తావా?" కొంతమంది ఇంకా extreme ఉంటారు... తమ లవర్ హాట్‌గా ఉంది కాబట్టి మిగతా వాళ్లంతా ఆమెకి లైన్ వేస్తున్నారనీ అమెతోనే చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. ఆమెని తాము own చేసుకున్నందుకు పరవశించిపోతుంటారు. దేవుడా.. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా? నీ లవర్, పార్టనర్ గురించి ఇంకొకడి కామపు ఆలోచనల్ని కూడా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావంటే.. చాలానే ఎదిగిపోయావు, గొప్ప విశాల హృదయం నీది!
ఇలా తప్పుగా చూడడం ఇమెచ్యూరిటీ అంటావా... నీ అంత మెచ్యూర్డ్‌గా భారతీయ సమాజం ఇంకా ఎదగలేదు... పెద్ద మనస్సు చేసుకుని క్షమించు.. నీ ప్రైవసీని నీ లవర్ నడుము వంపుల్లో వేళ్లతో తడుముతూ వెదుకులాడుకునే ఓ స్వేచ్ఛావాదీ!
Source: నల్లమోతు శ్రీధర్