నా కలలో నువ్వే నా జీవితం అనుకొన్నాను. కానీ, నా జీవితంలో నువ్వు ఎప్పటికి కలగానే మిగిలిపోయావు.

చలం కొటేషన్స్

ఉన్నది దాచుకుంటాననేవాడికి దేవుడి భయం లేదు. నీది లాక్కుని పంచుతాననే వాడికి దేవుడు లేడు. అందుకనే, పశుబలం, యుక్తీ, తెలివీ ఇవే ప్రాబల్యంలోకి వచ్చాయి. ధర్మం, న్యాయం, సత్యం అనేవి ఉత్త మాయ మాటలైనాయి. 

తనకు రావలిసిన హక్కులకన్న, తను నెరవేర్చవలసిన బాధ్యతల పైన దృష్టి నిలపాలి స్త్రీ. బైట ఉన్న పరిస్తితులకన్న, తన చుట్టూ ఉన్న వాతావరణం నించి కన్న స్వతంత్రమూ, శాంతీ, హృదయంలోపల పలికి వచ్చినప్పుడే స్తిరంగా నిలుస్తాయి అవి. అత్త అధికారంనించీ, భర్త అధీనం నుంచీ తప్పించుకుంటున్న నవీన స్త్రీ, షోకులకీ, సంఘ గౌరవానికీ, ఫాషిన్సికీ బానిస అవుతోంది. ఒక పురుషుడి నీడ కిందనుంచుని (ఆ పురుషుడికి బానిస అయితేనేంగాక) లోకాన్ని ధిక్కరించగలిగే ఇల్లాలు, ఈనాడు సంఘ గౌరవం పేర, ఉద్యోగం పేర, ఫాషన్ పేర వెయ్యిమందికి దాస్యం చేస్తోంది. నవీన స్త్రీకి - తనచుట్టూ స్త్రీలందరూ అత్తలైనారు!

మాట్లాడటానికి స్వేచ్ఛా, శక్తీ ఉన్ననాడే నిజమో అబద్ధమో చెప్పగలడు. అట్లా తన స్వేచ్ఛని ఉపయోగించేవాడే, ఈనాడు అబద్ధాలు చెప్పినా, ఒకనాడైనా నిజం చెప్పడంనేర్చుకుంటాడు.

కుక్కకి యజమానుడు ఎంత అవసరమో, ఆడపిల్లకి మొగుడు అంత అవసరం. కాని, ప్రతి స్త్రీకి ఇట్లా ఏదో ఒక భర్త ఎల్లాంటివాణ్ణో ఒకణ్ణి దానం చేసితీరే సంఘం, భర్త లేకపొతే ఒప్పుకోని సంఘం, ఆ భర్త పోతే మళ్ళీ దానం చెయ్యదేమి? స్త్రీకి భర్త ఉండటమే అంత అవసరమైతే, ఎప్పుడూ ఉండనక్కర్లేదూ? భర్త ఒద్దని ఏడుస్తున్న చిన్న పిల్లలకి బలవంతంగా కట్టబెడుతుంది, భర్త కావాలని గోలపెడుతున్న వితంతువులకి నిరాకరిస్తుంది సంఘం. ఏం తెలివి?

కులం కార్య విభాగమే, కులాలలో సమత్వమూ, సమాన గౌరవమూ, ఉన్నన్నాళ్ళూ నిలిచాయి కులాలు. కార్య విభాగంలో భేదంగాని, గౌరవంలో భేదంగాని రాగానే వేరుపురుగు పుట్టిందన్నమాటే. మూఢత్వమూ, అజ్ఞానమూ తగ్గగానే తక్కువజాతి వాళ్ళనేవాళ్ళు మోసం తెలుసుకుని తిరగబడుతున్నారు. స్త్రీ కూడా అంతే. ఆమె బుద్ధికుశలత పరీక్షించకుండా, స్త్రీ అయినంత మాత్రంచేత, ఆమె భాగానికెప్పుడూ నీచ కార్యాలే ఇస్తే, అది సరైన కార్య విభాగమెట్లా అవుతుంది? ఆమెచేసే వంటా, సేవా నీచంకావనీ, ఇంటిపనులవల్ల ఆమె రాణిలాగ గౌరవం పొందుతోందనీ దేశాభిమానులూ, మతాభిమానులూ పెద్ద పెద్ద ఉపన్యాసాలిస్తారు. కాని ఉపన్యాసమై ఇంటికి పోగానే, కాళ్ళుకడుక్కోవడానికి నీళ్ళు సిద్ధంగా లేకపోతే "ఏమే! వొళ్ళు కొవ్విందా? నీళ్ళు పెట్టక యేం చేస్తున్నావు? ఈసారి సిద్ధంగా ఉండకపోనీ, నీ పని చెపుతా" నంటాడు
"నువు సరిగా డబ్బు సంపాదించడంలేదు,బజారు సామానులు వేళకు తీసుకురాలేదు, వీపు చీలుస్తాను వెధవా!" అని స్త్రీ అంటే గౌరవిస్తారా? పోనీ ఆ కార్యాల నీచమే తమకి లేకపోతే పురుషుడే చెయ్యరాదూ వాటిని? ఆ నేను వంటచేస్తానా? అంటాడు అయ్యగారు. పనిలేక ఇంట్లో సోమరిగా కూచునే పనికిమాలినవాడూ, ఊళ్ళో జీతానికి వంటచేసేవాడు కూడా భార్యకి వండి పెట్టడు.

స్త్రీ ఒక మాటవల్లా,చూపువల్లా పురుషునికి సందిచ్చిందా....ఇక అతని అధికారానికీ, కోరికలకీ, విన్నపాలకీ అంతం ఉండదు. అసలు పర్యవసానం అక్కర్లేని స్త్రీ మొదటినించి విముఖంగానే ఉండాలి......నిప్పు వలె ఉండాలి.

...ఉదాహరణలు వాస్తవాన్ని ఎన్నడూ ఋజువు చెయ్యలేవు. ఊరికే నిజాన్ని గ్రహించి చూపగలవు.

సినిక్ ఎవరో తెలుసునా? మన కలలకీ, అబద్ధపు నమ్మకాలకీ గాయం అయ్యేట్టు నిజం మాట్టాడేవాడు. 

పాపకార్యాలమీద చాలారోత నాకు. ఒక అబద్ధం చెప్పాననుకో ఎంత బాధపడిపోతానో! నన్ను నేను అసహ్యించుకుంటాను. సిగ్గుపడతాను. పశ్చాత్తాప్పడతాను. ఏ పాప కార్యమైనా నా కంతే. 

Source: http://telugu.pratilipi.com/read?id=5356211383828480&ret=/teluguculture